
రాజకీయాలు ఎప్పుడూ నల్లేరుపై నడక కాదు.. క్షణం..క్షణం రంగు మార్చుకుంటుంటాయి. ఎప్పుడూ ఒకే రకంగా ఉండే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎదుర్కొంటున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. గత 2014, 2019 ఎన్నికల్లో ఆయన పరిస్థితి నల్లేరుపై నడకగా మారిపోయింది. దీనికి కారణం.. బలమైన టీడీపీ కేడర్ అంతా కూడా ఆయన వెంటే ఉంది. ప్రజలు కూడా ఆయనను నమ్మారు.
స్థానికంగా కూడా టీడీపీని వంశీ డెవలప్ చేశారు. కేడర్‌ను పెంచుకున్నారు. యువతలో భరోసా నింపారు. దీంతో గత రెండు ఎన్నికల్లోనూ ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆయన అసలు ఎన్నికలను పెద్ద సీరియస్ గా కూడా తీసుకోలేదు. పరిటాల రవి దగ్గర తీసుకున్న ట్రయినింగ్ వంశీకి ఇప్పటిదాకా బాగానే ఉపయోగపడింది. మునుపు ఆయనకు పార్టీలోనూ ఎంతో ఇమేజ్ ఉండేది. తిరుగులేని నాయకుడిగా ఆయన ఒక ఊపు ఊపారు. అయితే.. ఆయన కోరి కోరి 2019 ఎన్నికల్లో విజయం దక్కించుకున్నాక వైసీపీ పంచన చేరిపోయారు. వ్యక్తిగతంగా ఆయనకు ఇది ఆనందాన్ని ఇచ్చి ఉండొచ్చు. కానీ.. రాజకీయంగా మాత్రం వంశీకి ఇది పూర్తి మైనస్ అయిపోయిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. తటస్థులు కూడా వంశీని నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని.. అనేక ఆన్‌లైన్ చానెళ్లు చేస్తున్న సర్వేల్లో తేలి పోయింది. వంశీ అంటే ఎంతో గౌరవం ఉందని అంటున్న వారు కూడా.. ఎన్నికల విషయానికి వచ్చే సరికి మాత్రం ఇప్పుడే ఏం చెప్పలేం.. అని అనేస్తున్నారు.
నిజానికి ఇలాంటి పరిస్థితి వంశీకి ఎప్పుడూ ఎదురు కాలేదు. ఆయనే మా ఎమ్మెల్యే అని బల్లగుద్ది మరీ చెప్పిన పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైగా.. ఆయన ఉన్న వైసీపీలోనూ.. ఆయనకు ఎదురు గాలి వీస్తోంది. గతంలో ఆయన టీడీపీలో ఉంటే.. నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. కానీ.. ఇప్పుడు వైసీపీలో ఆయనకు అంతా వ్యతిరేకంగానే కనిపిస్తోంది. ఈ విషయంలో మాత్రం.. అధిష్టానంకు మాత్రమే ఎటూపాలుపోని పరిస్థితి. గ్రౌండ్ లెవెల్ లో మాత్రం.. డెబ్బై శాతం వ్యతిరేకత కనిపిస్తోంది. అటు యార్లగడ్డ వెంకట్రావ్..ఇటు దుట్టా.. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన చెమట చిందించాల్సిందే అనే రాజకీయ పండితులు భావిస్తున్నారు.
|