vallabhaneni vamsi in silent mode
Telecast Date: 22-08-2023 Category: Political Publisher:  SevenTV

 

రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. ఆ నియోజకవర్గం తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. అయితే టీడీపీకి వెన్నుముక లాంటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎప్పుడైతే పార్టీ మారారో అప్పటి నుంచి అక్కడ టీడీపీకి ఎదురుగాలి వీస్తోంది. ఎందుకంటే సైకిల్ గుర్తుపై గెలిచిన వల్లభనేని వంశీ ప్రస్తుతం వైసీపీ మద్దతుదారుడిగా ఉన్నారు.


అయితే కొద్ది రోజులుగా వైసీపీకి గట్టి షాక్‌ ఇచ్చి ఫ్యాన్‌ గాలికి దూరంగా సైకిల్‌ ఎక్కడానికి వెళ్లిపోయారు యార్లగడ్డ వెంకట్రావు. టీడీపీ లో చేరేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలవడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఇదంతా జరుగుతున్నా వంశీ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. వంశీ ప్రస్తుతం ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు అనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.


తన మాటల దాడితో ప్రత్యర్థులను ఇరుకునపెట్టే వంశీ తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపైన పెదవి విప్పకాపోవడానికి కారణాలేంటి అనేది ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అప్పటివరకు దివంగత పరిటాల రవి అనుచరుడుగా ఉన్న వల్లభనేని వంశీ.. 2004లో తన స్వగ్రామమైన గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం రాజకీయ అరంగ్రేటం చేశారు.

గన్నవరం శాసనసభ టికెట్‌ను ఆశించి తన తల్లి వల్లభనేని అరుణ ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. చాలా తక్కువ కాలంలోనే గన్నవరం నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యారు కూడా. మొదటిసారి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ స్వల్ప మెజారిటీతో పరాజయం చెందారు.


అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా మానికొండలో వంశీ, డాక్టర్ బాలవర్ధన్ రావు వర్గీయులకు మధ్య జరిగిన కొట్లాటలో వంశీదే తప్పని తేలడంతో క్రమశిక్షణ చర్య కింద కొంతకాలం పాటు పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆ తరువాత 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో అనుహ్యంగా టీడీపీ టికెట్ పొందిన వల్లభనేని వంశీ మోహన్.. వైసీపీ అభ్యర్థి డాక్టర్ దుట్టా రామచంద్రరావుపై పోటీ చేసి విజయం సాధించారు.


2019లో కూడా టీడీపీ నుంచి శాసన సభ్యుడుగా పోటీ చేసిన వంశీ మోహన్.. యార్లగడ్డ వెంకట్రావుపై కేవలం 833 ఓట్లతో వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకొని మరీ గెలుపుబావుట ఎగరేశారు. అయితే తర్వాత పరిణామాలతో వైసీపీ మద్దతుదారుడిగా మారిపోయారు. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలను టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో నెరవేర్చలేక పోతున్నానని, అందువల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో పార్టీ మారుతున్నానని కార్యకర్తలకు చెప్పారు.

వైసీపీలో చేరి మూడు సంవత్సరాలైనా పార్టీ మారే సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోవటం.. తన రాజకీయ ప్రత్యర్థులైన దుట్టా, యార్లగడ్డ వర్గాలకు చెందిన కార్యకర్తలు సహకరించకపోవడం వల్ల వంశీ కొంత ఇబ్బంది పడుతున్నారనేది నియోజకవర్గ నేతలు చెబుతున్న మాట. తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా కొనసాగినప్పుడు తనతో పాటు పనిచేసిన ముఖ్య కార్యకర్తలు మాత్రమే వల్లభనేని వంశీతో పాటు వైఎస్సార్సీపీలో చేరారు.

కానీ సామాన్య టీడీపీ కార్యకర్తలు ఎవరూ కూడా వంశీతో పాటు వైసీపీలో చేరకపోవడంతో పాటు తనకు సహకరించకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొకొంటున్నారనే ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వంశీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు తప్పు అంటూ మాట్లాడిన తెలుగుదేశం కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేయించడం వంటి సంఘటనలు కూడా వంశీకి నియోజకవర్గంలో చెడ్డపేరు తెచ్చిపెట్టాయి.


అయితే మొన్నటి వరకు పరిణామాలు ఎలా ఉన్నా తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, సమీకరణాలపై వంశీ ఎక్కడ కూడా నోరు మెదపడం లేదు. యార్లగడ్డ వరుస సమావేశాలు పెట్టుకోవడం, చంద్రబాబును కలవడం, వైసీపీని విమర్శలు చేయడం వంటి అంశాలను సైలెంట్‌గా గమనిస్తున్నారు.


వంశీ ఎప్పుడు నోరు మెదుపుతారని దానిపై నియోజకవర్గ నేతలు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే వల్లభనేని వంశీ అంతా తేలికైన మనిషి కాదని…సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటున్నారని, కరెక్ట్ టైంలో పేల్చాల్సిన బాంబు పేలుస్తారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading