pawan kalyan comments on cm post
Telecast Date: 18-08-2023 Category: Political Publisher:  SevenTV

 

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. శాంతి భద్రతల్లో ఏపీ బీహార్ ని మించిపోయిందని, ఏపీ క్రైమ్ కి అడ్డగా మారిపోయిందని ధ్వజమెత్తారు. శుక్రవారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మూడవ విడత వారాహి విజయ యాత్రకు ప్రజలు బ్రాహ్మరథం పట్టారన్నారు. నాకు ఉత్తరాంధ్ర అంటే అపారమైన ప్రేమ ఉందన్నారు. ఇక్కడ అపారమైన సహజ వనరులు ఉన్నాయని చెప్పారు.


ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులు వలస వెళ్లిపోతున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇక్కడ సహజ వనరుల దోపిడీ ఎక్కువ జరిగిందని.. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రలో 30 వేల ఎకరాలను వైఎస్ కుటుంబం కొనుగోలు చేసిందన్నారు. ఉత్తరాంధ్రపై వారికున్నది ప్రేమ కాదు.. రాజధాని పెట్టి వ్యాపారం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.


ఉత్తరాంధ్ర వనరులు దోపిడీ చేస్తే మాట్లాడేవారు లేరని వారి అభిప్రాయమని దుయ్యబట్టారు పవన్. నిన్న జనసేన పార్టీ నిర్వహించిన జనవాణిలో వచ్చిన సగం ఫిర్యాదుల్లో భూ కబ్జాలే ఉన్నాయని తెలిపారు. మైనర్ బాలికను కిడ్నాప్ చేశారని నా దృష్టికి వచ్చింది.. పోలీసు అధికారులు ప్రభుత్వాన్ని వెనకేసుకొని రావడం మంచిది కాదన్నారు పవన్ కళ్యాణ్.

బాలికలపై అత్యాచారం జరిగితే తల్లితండ్రుల లోపం అని హోమ్ మంత్రి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. చిత్తూరు ఎస్పీ ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారని విమర్శించారు. తాడేపల్లిలోనే ఎక్కువ క్రైమ్ రేట్ ఉందని.. ఎందుకంటే ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర భూములు దోపిడీకి గురవుతున్నాయని, ఉత్తరాంధ్ర ప్రజలు ఒకలా ఆలోచిస్తుంటే.. నాయకులు మరోలా ఆలోచిస్తున్నారని అని చెప్పారు పవన్ కళ్యాణ్. ఖనిజ సంపద మన రాష్ట్రనికి చాలా అవసరం పేర్కొన్నారు.


చెట్ల కింద కూర్చొని పాఠాలు చెప్తున్నారు.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అలా ఉందని ఫైర్ అయ్యారు. మద్యం మీద ఆదాయం వద్దన్న వ్యక్తి.. 90 వేల కోట్లు సంపాదించారని అన్నారు. రాష్ట్రాన్ని పన్నుల మయం చేశారని దుయ్యబట్టారు. వైసీపీ నేతల దగ్గర వేల కోట్లు ఉన్నాయని ఆరోపించారు. అలాగే ప్రస్తుతం పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.


భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం రాగానే.. వీరు చేసిన తప్పులు అన్నింటిని బయటకు తీసుకొస్తామన్నారు. నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోడానికి.. సంసిద్ధంగా ఉన్నాను.. కాకపోతే ఓట్లు చీలకూడదు అనేది నా ఆలోచన పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading