modi hoists tricolor flag in red fort address national highlighting its strenghths
Telecast Date: 15-08-2023 Category: Political Publisher:  SevenTV

 

 

భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ నేడు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద భావోద్వేగభరిత ప్రసంగం చేశారు. మరో వెయ్యేళ్ల వరకూ భారత్ వెలుగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. తొలుత ప్రధాని రాజ్‌ఘాట్ వద్ద జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం, ఎర్రకోటకు చేరుకున్నారు. త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించిన అనంతరం ప్రధాని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత, దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదేనన్న ప్రధాని, దేశస్వాతంత్ర్యం ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితంగా వర్ణించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రతి నిర్ణయంలో తాను మొదట దేశానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. భారత్‌లో సుస్థిరమైన, శక్తిమంతమైన ప్రభుత్వం ఉందన్నారు. గత పదేళ్లల్లో తమ ప్రభుత్వం ఎన్నో కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చిందనీ, దేశం ప్రస్తుతం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని చెప్పారు. వ్యవసాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు, స్టార్టప్స్, అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ పురోగతిని వివరించారు. 

కరోనా సంక్షోభాన్ని కూడా మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆ సమయంలో భారత్ ప్రపంచానికి ఆశాకిరణంగా నిలిచిందన్నారు. నాటి క్లిష్టసమయంలో ఎన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొని ముందుకెళ్లామని గుర్తు చేశారు. ప్రపంచంలో మార్పులు తీసుకురావడంలో భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషించిందన్నారు. 

గత పదేళ్లల్లో భారత్ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోందని మోదీ తెలిపారు. 30 ఏళ్ల లోపు యువత ప్రస్తుతం భారత్‌కు ఆశాకిరణమని వర్ణించారు. నారీ శక్తి, యువశక్తి దేశానికి ఎంతో కీలకమని చెప్పారు. టెక్నాలజీలో ఎంతో మెరుగైన భారత్, డిజిటల్ ఇండియా కల సాకారం దిశగా దూసుకుపోతోందన్నారు. 

యావత్ దేశం మణిపూర్ ప్రజలకు అండగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు. మణిపూర్‌లో శాంతిస్థాపనకు కృషి చేస్తున్నామని తెలిపారు. అక్కడి పరిస్థితులు మెరుగవుతున్నాయని కూడా పేర్కొన్నారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading