megastar chiranjeevi birthday special
Telecast Date: 22-08-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

1982లో ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన కూర్చున్న నెంబర్ వన్ స్థానం కృష్ణ గారికే వస్తుందనే ధీమా అభిమానుల్లో ఉండేది. వయసు దృష్ట్యా అప్పటికే ఏఎన్ఆర్ కుర్ర హీరోలతో పోటీపడేందుకు సిద్ధంగా లేరు. శోభన్ బాబు, కృషంరారాజులు స్టార్లుగా స్థిరపడ్డారు. అయితే ఖైదీ రూపంలో ఒక సునామి తెలుగు ప్రేక్షకులను నేరుగా తాకుతుందని ఎవరూ ఊహించలేదు. డాన్సులతో ఒక కొత్త ఒరవడిని సృష్టించి, యూత్ కి డ్రగ్ గా ఎక్కేసే మ్యానరిజంతో పిచ్చెక్కించి ఓ యువకుడు సింహాసనం ఎక్కుతాడని ఎవరూ కలగనలేదు. దాన్నే సాధ్యం చేశారు చిరంజీవి.


పసివాడి ప్రాణంతో చిరు స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఘరానా మొగుడు మొదటి పది కోట్ల గ్రాసర్ గా నిలిచినప్పుడు టైమ్స్ మ్యాగజైన్ లో బిగ్గర్ దాన్ బచ్చన్ హెడ్డింగ్ తో వెలువరించిన సంచిక అప్పట్లో సంచలనం. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, ఛాలెంజ్ చిరు నిజమైన సత్తాని బయటికి తీసిన కమర్షియల్ బ్లాక్ బస్టర్స్. అలా అని కేవలం వీటికే కట్టుబడకుండా స్వయంకృషి, రుద్రవీణ, శుభలేఖ, ఆపద్బాంధవుడు లాంటి సందేశాత్మక చిత్రాలతోనూ తనలో యాక్టర్ కి సవాలుని, సంతృప్తిని ఏకకాలంలో అందజేయడం ఆయనకే చెల్లింది.


క్లాసు మాస్ తేడా లేకుండా ఎవరైనా అతిశయోక్తులు పోతున్నారంటే నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా అంటూ జనం ఆ పేరుని ఊతపదంగా మార్చుకోవడం ఏళ్ళ తరబడి కొనసాగింది. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, అల్లుడా మజాకా, ముఠామేస్త్రి వగైరాలన్నీ బాక్సాఫీస్ గ్రామర్ ని కొత్తగా రాసినవే. వరస ఫ్లాపులతో 1995లో ఏడాది గ్యాప్ వచ్చినా హిట్లర్ తో తిరిగి రేసులోకి రావడం, ఎగుడుదిగుడులు ఎదురైనా ఇంద్ర లాంటి ఇండస్ట్రీ హిట్ తో తనకు కాలాతీత మార్పులతో సంబంధం లేదని నిరూపించడం చిరుకే సాధ్యం. ప్రజారాజ్యం స్థాపన, దాని కోసం ఎనిమిదేళ్ల నట సన్యాసం ఫ్యాన్స్ కు ఒక చీకటి ఘట్టం.


ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చాక పునఃప్రవేశంతోనే వంద కోట్ల బొమ్మని సాధించడం చిన్న విషయం కాదు. ఫలితాలు ఎలా ఉన్నా సైరా, గాడ్ ఫాదర్ లు మంచి ప్రయత్నాలుగానే నిలిచాయి. వాల్తేరు వీరయ్యతో తనలో వగరు తగ్గలేదని మళ్ళీ నిరూపించారు. భోళా శంకర్ నిరాశపరిచినా విజయ్ దేవరకొండ అన్నట్టు ఫెయిల్యూర్ తో ప్రభావం చెందే స్టార్ డం కాదు కాబట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఒకే ఒక్క హిట్టు సినిమాతో జరిగిపోతుంది. హీరోలు, దర్శకులు, నిర్మాతల్లో అధిక శాతం మా ఫేవరెట్ హీరో చిరంజీవని చెప్పుకోవడానికి మించిన గర్వకారణం ఏముంటుంది అభిమానికైనా, ఆయనకైనా.


 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading