
మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'గుంటూరు కారం'. చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి ఈ సినిమా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ప్రాజెక్టు ఆగిపోయిందని, కథలో మార్పులు చేశారంటూ పుకార్లు వచ్చాయి. పలువురు బడా స్టార్లు, టెక్నీషియన్లు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అయినప్పటికీ అనుకున్న టైమ్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. ఈ రోజు సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు.
ఈసందర్భంగా ఆయన అభిమానులను ఖుషీ చేసే అప్‌డేట్ చిత్ర బృందం నుంచి వచ్చింది.ఈ సినిమాలోని మహేశ్ బాబు మాస్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. లుంగీ కట్టుకొని, ఫుల్ హ్యాండ్ చొక్క వేసుకొని, కళ్లజోడు పెట్టుకొని బీడీ వెలిగించుకుంటున్న ఫోటో అభిమానులను అలరిస్తోంది. సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెల మూడో వారంలో మొదలవనుంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|