madhya pradesh assembly election polling today
Telecast Date: 17-11-2023 Category: Political Publisher:  SevenTV

 

 

 

సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు(శుక్రవారం) మధ్యప్రదేశ్ లో పోలింగ్‌ జరగనుంది. ఒకే దశలో జరగనున్న పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అయితే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ ఉదయం 7 గంటలకే మొదలై మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలు ఉండగా 47 ఎస్టీ, 35 ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 64,626 పోలింగ్ స్టేషన్లు ఉండగా 2,533 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అభ్యర్థుల్లో 2,280 మంది పురుషులు, 252 మంది మహిళలు, ఒకరు థర్డ్ జెండర్ వ్యక్తి ఉన్నారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెల్లడించారు.

కాగా మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేశాయి. కేంద్ర, రాష్ట్ర పథకాలే తమను తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని బీజేపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై అవినీతి ఆరోపణలు తమకు అనుకూలంగా మారతాయని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖుల్లో ప్రధానంగా బుద్నీ నుంచి సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, డిమ్నీ నుంచి కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, నర్సింగపూర్‌లో ప్రహ్లాద్ సింగ్ పటేల్, నివాస్‌లో ఫగ్గన్ సింగ్ కులస్తే, చింద్వారా మాజీ సీఎం, కాంగ్రెస్ దిగ్గజం కమల్‌నాథ్ పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ ఇండోర్-1, బీజేపీ ఎంపీలు రాకేష్ సింగ్, గణేష్ సింగ్, మరియు రితీ పాఠక్ కూడా ఎన్నికల బరిలో ఉండడం విశేషం.

ఇక రాష్ట్రంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం జరిగింది. బీజేపీ తరపున ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పెద్ద సంఖ్యలో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఏకంగా 14 సభల్లో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ-వాద్రా, కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్‌తోపాటు పలువురు నేతలు బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading