balapur laddu fetches a record rs 27 lakhs
Telecast Date: 28-09-2023 Category: Business Publisher:  SevenTV

 

 

 

దేశవ్యాప్తంగా పేరొందిన బాలాపూర్ లడ్డూను ఈ ఏడాది తుర్కయాంజల్ కు చెందిన దాసరి దయానంద రెడ్డి సొంతం చేసుకున్నారు. గురువారం ఉదయం జరిగిన వేలంపాటలో మొత్తం 36 మంది పోటీపడగా.. రూ.27 లక్షలకు దయానందరెడ్డి దక్కించుకున్నారు. ఈ వేలంపాటలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

ఉదయం రూ.1,116 తో బాలాపూర్ ఉత్సవ సమితి వేలంపాటను ప్రారంభించింది. గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీ పడడంతో ధర అమాంతం పెరుగుతూ పోయింది. చివరకు రూ.27 లక్షలు పాడిన దయానందరెడ్డి లడ్డూను సొంతం చేసుకున్నారు. కాగా, లడ్డూ వేలం పూర్తవడంతో ఉత్సవ కమిటీ గణేషుడి శోభాయాత్రను ప్రారంభించింది. చాంద్రాయణగుట్ట, షాలిబండ, ఫలక్ నుమా, చార్మినార్ మీదుగా బాలాపూర్ గణపతి హుస్సేన్ సాగర్ చేరుకుంటారు.

రూ.450 తో మొదలైన వేలం..
బాలాపూర్ గణపతి లడ్డూ వేలం దేశవ్యాప్తంగా పేరొందింది. 1994 నుంచి లడ్డూ వేలం ప్రారంభించారు. తొలి ఏడాది రూ.450 లకు కొలన్ మోహన్ రెడ్డి అనే రైతు గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 28 సార్లు లడ్డూ వేలం నిర్వహించారు. కరోనా కారణంగా 2020లో లడ్డూ వేలం నిర్వహించలేదు. ఆ ఏడాది లడ్డూను ఉత్సవ కమిటీ సీఎం కేసీఆర్ కు అందజేసింది. గణేషుడి లడ్డూను వేలం వేయగా వచ్చిన సొమ్ముతో బాలాపూర్ ఉత్సవ కమిటీ స్థానికంగా పలు అభివృద్ధి పనులు చేస్తోంది.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading