afghanistan cricket board may not give noc to 3 key players to ipl
Telecast Date: 27-12-2023 Category: Sports Publisher:  SevenTV

 

ఆఫ్ఘనిస్థాన్ స్టార్ క్రికెటర్లు ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్, ఫజల్‌హక్ ఫరూఖీలు వచ్చే ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆడడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ముగ్గురు ఆటగాళ్లకు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు ఎన్‌వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) ఇవ్వకపోవచ్చునని తెలుస్తోంది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తమను విడుదల చేయాలంటూ ఈ ముగ్గురు ఆటగాళ్లు దరఖాస్తు చేసుకోవడంపై బోర్డు ప్రతికూలంగా స్పందించింది. దేశం తరపున ఆడడం కంటే విదేశీ లీగ్‌లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ ముగ్గురు ఆటగాళ్ల విజ్ఞప్తిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దీంతో 2024కి సంబంధించిన ఆటగాళ్ల వార్షిక ఒప్పందాలను కూడా ఆలస్యం చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

 

ఈ ముగ్గురు ఆటగాళ్లు సెంట్రల్ కాంట్రాక్ట్‌పై సంతకం చేయకుండా భారీగా డబ్బులు ముట్టజెప్పే విదేశీ లీగ్‌లలో పాల్గొనాలని భావిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ తరపున ఆడడం జాతీయ బాధ్యత అని, ఇందుకు విరుద్ధంగా వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటనలో పేర్కొంది. కమిటీ సిఫార్సులు ఆధారంగా ఈ ముగ్గురు ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు కూడా ఉంటాయని స్పష్టం చేసింది. కాగా ఈ ప్రత్యేక కమిటీ మూడు సిఫార్సులు చేసినట్టుగా తెలుస్తోంది. కాగా ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2024 వేలంలో ముజీబ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక నవీన్‌ ఉల్ హక్ లక్నో సూపర్ జెయింట్స్‌ తరపున, ఫరూఖీని సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading